Saturday, September 5, 2015

మేల్కొనవోయ్…

నిద్రపోతున్నావా ఇంకా నీవు
మాతృ దేశపు ఒడిలో ఆదమరచి
నీ కోసమై కొన్ని కోట్ల కళ్ళు ఎదురుచూస్తుంటే
నీ సేవకై నిర్భాగ్యులు పరితపిస్తుంటే
నిద్రపోతున్నావా ఇంకా నీవు.
                                  
నిశీధిని చీల్చుకుంటూ వచ్చిన
నవయుగ ప్రచండ భానుడి కిరణాలు
నిను తాకుతు లేవమని ఉసిగొల్పుతుంటే
నిరాశలో మునిగిన నిరాశ్రయులు
నీ సహాయానికై అర్రులు చాస్తుంటే
నిద్రపోతున్నావా ఇంకా నీవు.

రాజకీయ స్వప్రయోజనాలకై
నీ సహోదరులు అంతరాలు పెంచుతుంటే
వారి మధ్యన వాగ్యుద్ధాలు
మన తల్లి గుండెను గాయపరుస్తుంటే
నిద్రపోతున్నావా ఇంకా నీవు.

అంతర్యుద్ధపు అగ్నికీలలను
ఆర్పివేసి మానవాస్థిత్వాన్ని
ఆదుకోవలసిన భారతీయుడవి
నిద్రపోతున్నావా ఇంకా నీవు.

ఘంటాపథంగా మోగుతుందోయ్ గంట
సిరిపైరై ఎగిరిందోయ్ పంట
సమయామాసన్నమైనది మేల్కొనవోయ్
సమస్య సమసించడానికి పూనుకొనవోయ్.

నింగికి వేసెయ్ నిచ్చెనలు
వేగిరం చేయవోయ్ నీ పనులు
అవిగో వస్తున్నాయ్ అవకాశాలు
అందుకుని సృష్టించవోయ్ అద్భుతాలు.

అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ
గనిలో వనిలో అవనిలో
అంతరిక్షమున మైదానంలో
సగర్వంగా నిగర్వంగా
ఎగరవేయవోయ్ మువ్వెన్నెల పతాకాన్ని.

                   ---ఫకీర్

No comments:

Post a Comment