నా తెలుగు మిత్రులందరికీ
నమస్కారం. ఇది చదవబోయే ముందు నాదొక చిన్న విన్నపం. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.
నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నేను కూడా మీలా సగటు
తెలుగు వాడిని. అంతర్జాలంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయమై జరుగుతున్న రగడ గురించి
నాకు తెలిసిన విషయాలు, అలాగే నా అభిప్రాయం మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను. దీనిని
పూర్తిగా చదివిన తరువాత మాత్రమే మీరు స్పందించాలని కోరుకుంటున్నాను.
ముందుగా ప్రత్యేక
హోదా గురించి మనలో ఉన్న అపోహలు మరియు నిజాల గురించి మాట్లాడుకుందాం.
1. ప్రత్యేక
హోదాకు ఆంధ్రులు అర్హులు. దానిని సాధించుకోవటం మన హక్కు;;; ప్రత్యేక హోదాకి అర్హత పొందాలంటే
రాష్ట్రమంతా కొండలు, అడవులు ఉండి వ్యవసాయానికి, మరే ఇతర పరిశ్రమలు పెట్టడానికి వీలు
లేని భౌగోళిక స్వరూపమై ఉండాలి. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి. లోటు బడ్జెట్ ఉండాలి.
మనకి సంవత్సరానికి రెండు సార్లు పండే సస్యశ్యామలమైన మైదానాలున్నాయ్. పరిశ్రమలు స్థాపించటానికి
కావాల్సినన్ని బంజరు భూములున్నాయ్. సాగు నీటిని, త్రాగు నీటిని ఇచ్ఛి దాహార్తిని తీర్చే
నదులున్నాయ్. అంతర్జాతీయ సరిహద్దు లేదు కాని అద్భుతమైన వ్యాపార సామర్ధ్యం గల సముద్రతీరం
ఉంది. ఇహ మూడోది, లోటు బడ్జెట్ అనేది ఒకట్రెండు మినహా అన్ని రాష్ట్రాలకు ఉంది. అంతెందుకు
కేంద్ర ప్రభుత్వం అప్పు తేకుండా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు లేదు. నిజాయితీగా
మాట్లాడుకుంటే మనం ప్రత్యేక హోదా అడిగితే, అన్నీ ఉన్నవాడు ఆకలి అని అరిచినట్లుంటుంది.
2. రాజ్యాంగాన్ని
సవరించి ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు;;; ఇవ్వొచ్చు. కానీ అది జరిగే పని కాదు.
అటువంటి చట్టాలకు మొకాలడ్డటానికి పక్క రాష్ట్రమైన తమిళనాడుతో సహా చాలా గుంటకాడ నక్కలు
ఎదురుచూస్తూ ఉంటాయి. 14వ ఫైనాన్స్ కమీషన్ ని తోసిరాజని మనకి హోదా ఇస్తే దీనిని అలుసుగా
తీసుకుని మిగతా రాష్ట్రాల వారు అలివిగాని గొంతెమ్మ కోర్కెలు కోరటం మొదలు పెడతారు. ఐనా
కాని మనం ప్రత్యేక హోదా కోసం మంకు పట్టు పడితే ఇవ్వలేదని తెలిసీ అమ్మ మీద అలిగి పేచీ
పెట్టినట్లు ఉంటుంది.
3. ప్రత్యేక
హోదా వస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి.;;; శుద్ధ తప్పు. ఇది సగం అబద్ధం. ప్రత్యేక హోదా
వస్తే పరిశ్రమలకు కొంత మేరకు రాయితీలు వచ్చే మాట నిజమైనప్పటికీ, పెట్టుబడులను ఇవి పూర్తిగా
ఆకర్షించలేవు. పరిశ్రమలు రావలంటే మనం ముందు చేయవలసింది మౌళిక సదుపాయాలు కల్పించటం మరియు
అనుకూలమైన వాతావరణం సృష్టించటం. నిజం చెప్పాలంటే హోదా వస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి
ఎక్కువ నిధులు ఇస్తుంది, ఆ ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. కాని క్రితం సంవత్సరం
కేంద్ర బడ్జెట్ గమనిస్తే మామూలు రాష్ట్రాలకు, ప్రత్యేక రాష్ట్రాలకు మధ్యన వ్యత్యాసం
చాలా తగ్గిపోయింది. రేపు జీయస్టీ వస్తే ఈ అంతరం ఇంకా కనుమరుగవుతుంది.
మనం నిజాయితీగా
ఉందాం. న్యాయంగా మాట్లాడుదాం. పోరాటం చేయాలి, కానీ అది ఎందుకోసం చేయాలి? దుగ్గరాజపట్నం,
మచిలీపట్నం సహా మనకి రావాల్సిన ఓడరేవుల కోసం చేయాలి. ఉద్యమం జరగాలి కానీ దేనికోసం జరగాలి?
సోలార్ పవర్ ప్లాంట్లు, చేనేత పరిశ్రమలు మొదలగు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల కోసం జరగాలి.
మనం అడగాల్సింది ప్రత్యేక రైల్వేజోన్ కాదు, మన రాష్ట్రం గుండా ఎక్కువగా రోడ్లు, రైలు
మార్గాలు నిర్మించాలని పట్టుపట్టాలి. ఇటువంటి చిట్టాలన్నీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ,
ఎక్కడెక్కడ మనకు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ మనం సాధించాలి. ఇవన్నీ ప్రత్యేక హోదా వచ్చినంత
మాత్రాన వచ్చేయవు. ప్రత్యేక హోదా అనేది ఒక పేరు మాత్రమే. దాని వలన వచ్చేవి పరిమితం.
ఆ పేరును రాజకీయం చేసి పబ్బం గడుపుకునే వారు కొందరు, దాని మీద యువత ఉద్యమిస్తే పేరు
కొట్టేయాలనే ఆలోచనతో కొందరు ఉన్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే వారు
లేరు. నిజంగా ఆ నాయకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ రోజు కేవలం విద్యార్థులు మాత్రమే
ఎందుకు అరెస్టయ్యారు. నాయకులమని చెప్పుకునే వాళ్ళు అరెస్టయ్యేంత వరకూ ఎందుకు పోరాడలేదు?
గత రెండున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో ఎన్నో లొసుగులున్నాయ్, వాటి గురించి వీళ్ళు ఎందుకు
ఎక్కువగా మాట్లాడరు? వాల్లకి కావలిసినవి ఓట్లు మాత్రమే, యువత దృష్టి ఇప్పుడు ఇటువైపు
వెంటనే మరులుతుంది కాబట్టి దీనిని ఆసరాగా తీసుకుని, యువకులను ఉద్యమం పేరుతో బలిపశువలను
చేసి రాజకీయంగా లాభపడాలన్నదే వారి అభిమతమై ఉండవచ్చు.
అయినా ఉద్యోగాల
కోసం కార్పోరేటు వాల్లను మనం పిలవటమేంది. మనం ఉద్యోగాలను సృష్టించుకోలేమా? ఒకవైపు దేశంలో
యువత స్టార్టప్పులని, బిజినెస్ లని ముందుకు దూసుకుపోతుంటే, ఎవడో వచ్చి మనకి ఉద్యోగమివ్వటమేంటి?
ఒక మంచి ఆవిష్కరణ కొన్ని వందల ఉద్యోగాలు సృష్టించగలదు, ఒక కొత్త ఉపాయం అనేక సమస్యలను
దూరం చేయగలదు. అటువంటి ఆవిష్కరణలు తెలుగు యువత చేయాలి. మనకు మనమే కొత్త ఉపాధులను సృష్టించుకోవాలి.
చేవ చచ్చినోడిలా ఒకడిచ్చేదాని కోసం మనం అరిచిగీ పెట్టడమేంటి? అదేం ఆత్మాభిమానం? తెలుగోడిలో
సత్తా ఉంది. తన కాళ్ళ మీద తాను నిలబడగలడు. నలుగుర్నీ నిలబెట్టగలడు అని అందరూ అనుకుంటే
అదీ ఆత్మాభిమానం. ఎమీ లేకపోయినా వీడు పైకొచ్చాడురా అంటే అదీ అసలైన గౌరవం. భావోద్వేగాలతో
ఆవేశపడిపోయి అడుక్కుంటారో లేక ఆ ఆవేశాన్ని ఆలోచింపచేసి ముందడుగేస్తారో ఇక మీ ఇష్టం.