Wednesday, August 26, 2015

కవి - కర్షకుడు

ఆకాశంలో గర్జించిన ఉరుములు
రైతుకొచ్చినవి తియ్యని కలలు
ఎగిసి పడిన ఎర్రటి అలలు
నా రక్తంలో రేగిన జ్వాలలు
                                   హర్షించినది కర్షక కష్టం
                                   కవ్వించినది కవితావేశం

తొంగి చూసినవి తొలకరి చినుకులు
వంగి కురిసినవి వర్షపు జల్లులు
చెంగున ఎగిరిన చేనులు చేమలు
పులకరించిన పుట్టలు చెట్టులు
                                   కర్షక కష్టం తీరేలాగా
                                  కవితావేశం చల్లారేలాగా

పొద్దు పొడిచిన భానుడి రేఖలు
సిద్ధమయ్యినవి దుక్కి ఎద్దులు
మూటను గట్టిన చల్ది ముద్దలు
నాగలి పట్టుకు బైలెల్లిన రైతులు
ఉవ్వెత్తున లేచిన భావపు మంటలు
మనః ప్రపంచంలో ఎత్తు కెరటంబులు
చదువుల తల్లి నాకిచ్చిన వరములు
కలం పట్టినవి ఈ బిడ్డడి కరములు
                                    కర్షక కష్టం తీరేదాకా
                                    కవితావేశం చల్లారేలాగా

పుడమి తల్లికి పురిటి నొప్పులు
మొలకెత్తినవి మొక్కల పిలకలు
తెలుగు తల్లి మెడలో మాలలు
కలం రాసిన ఈ పద కూర్పులు
                                  కర్షక కష్టం కవితావేశం
                                  ఫలించుటకు క్రోసెడు దూరం

పైకి లెగిసినవి గాలి పటములు
రైతింట నిండినవి ధాన్యపు రాశులు
పైపైకి ఎగసిన భావావేశపు అగ్నికీలలు
ఉద్భవించిన కమ్మటి కవితలు
                                  క్షామం తీర్చిన కర్షక కష్టం
                                  క్షేమం కూర్ఛిన కవితావేశం

విరిగిన తలుపులు ముక్కల చెక్కలు
మధ్య మధ్యలో ఎలుకల కలుగులు
తెలుగు భాషలో వెలుగుల జిలుగులు
మరో ప్రపంచంలో నా తొలి అడుగులు

              ---ఫకీర్

No comments:

Post a Comment